🏠 www.mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 29 September 2026, 11:05 pm Posted by : M TODAY NEWS

శ్రీవారి సన్నిధిలో ఏపీ, సింగపూర్ మంత్రుల భేటీ

News Image
ముఖ్యమైన పాయింట్స్:రాష్ట్ర అభివృద్ధి, విద్యా సంస్కరణలపై సుదీర్ఘ చర్చ- డ్రగ్స్ రహిత ఏపీ కోసం సింగపూర్ మోడల్- రాష్ట్ర ఐటీఐలకు సింగపూర్ ‘ఐటీఈ’ల సాంకేతిక సహకారం- డ్రాపౌట్ల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్న మంత్రి షణ్ముగం- సింగపూర్ మంత్రితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, విద్యా సంస్కరణలపై కీలక చర్చలు జరిగాయి. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, సింగపూర్ హోంమంత్రి కె. షణ్ముగం ఉదయం శ్రీవారిని కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఉభయ నేతలు రాష్ట్ర అభివృద్ధి, విద్యా రంగంలో సంస్కరణలు, సామాజిక భద్రత తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.


ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యాశాఖలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులను సింగపూర్ మంత్రికి లోకేష్ వివరించారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గుచూపేలా తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. దీనిపై స్పందించిన షణ్ముగం.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను అభినందించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా సందర్శించేందుకు ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు. సింగపూర్ తరహా అత్యుత్తమ విద్యా విధానాలను ఏపీలో అమలు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లోకేష్‌కు హామీ ఇచ్చారు.

డ్రాపౌట్లే డ్రగ్స్‌కు మూలం

బడి మానేసే (స్కూల్ డ్రాపౌట్) పిల్లలే భవిష్యత్తులో మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారిన పడుతున్నారని, తద్వారా అనేక సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయని షణ్ముగం గుర్తుచేశారు. డ్రాపౌట్ రేటును తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూనే, దానిని సున్నా శాతానికి చేర్చేలా మరింత పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.


సమాజానికి పెను ముప్పుగా మారిన మాదకద్రవ్యాల నిర్మూలనకు సింగపూర్ అమలు చేస్తున్న కఠిన చట్టాలను షణ్ముగం వివరించారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం సింగపూర్ మోడల్ అనుసరించేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు.

ఐటీఐలకు మహర్దశ

సాంకేతిక విద్యను ఆధునీకరించడంలో సింగపూర్‌లోని 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్' (ITE) సాధించిన విజయాలను షణ్ముగం ఈ సందర్భంగా పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఐటీఐ (ITI) లను సింగపూర్ ఐటీఈలతో అనుసంధానించాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. తద్వారా ఏపీ యువతకు అత్యుత్తమ ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ అందనుందని అంచనా వేస్తున్నారు.

అంతకుముందు మంత్రులు నారా లోకేష్, షణ్ముగం.. స్వామివారి సుప్రభాత, తోమాల, అర్చన సేవల్లో పాల్గొన్నారు. మూలవిరాట్టును దర్శించుకున్న అనంతరం సింగపూర్ మంత్రి షణ్ముగం శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం పలకగా, టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ పర్యటనపై మంత్రి నారా లోకేష్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "సింగపూర్ హోంమంత్రి కె. షణ్ముగంతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నాను. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు" అని పోస్ట్ చేశారు.
🏠 Home